“ఆయన… అగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును” అన్న మాటకి అర్థమేమిటి?
కొందరు పాస్పరిటీ గాస్పెల్ బోధించేవారు, ఈ సందర్భంలో అగ్నిలో బాప్తిస్మమనే మాటను తీసుకుని దానిని పరిశుద్ధాత్ముడు వచ్చినపుడు విశ్వాసులు చేసే భాషలు మాట్లాడడం, ప్రవచించడం వంటి కార్యాలకి ఆపాదిస్తుంటారు. దానికి వారు పెంతుకోస్తు పండుగ దినాన పరిశుద్ధాత్ముడు చేసిన కార్యాన్ని కూడా చూపిస్తుంటారు.యోహాను నేను నీళ్లలో మీకు బాప్తిస్మమిచ్చుచున్నాను; అయితే నాకంటె శక్తిమంతుడొకడు వచ్చుచున్నాడు; ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడను కాను; ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును. లూకా సువార్త 3:16
అపొస్తలుల కార్యములు 2:1-4
పెంతెకొస్తను పండుగదినము వచ్చినప్పుడు అందరు ఒకచోట కూడియుండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలివంటి యొకధ్వని ఆకాశమునుండి అకస్మాత్తుగా, వారు కూర్చుండియున్న యిల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలలవంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగ అందరు పరిశుద్ధాత్మతో నిండినవారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించినకొలది అన్యభాషలతో మాటలాడసాగిరి.
మనం చూసిన ఆ వచనంలోనే ఆయన (యేసుక్రీస్తు) మొదటిగా పరిశుద్ధాత్మలో బాప్తిస్మమిస్తారని స్పష్టంగా ఉంది అటువంటపుడు అదే పరిశుద్ధాత్మ కార్యాన్ని (కుమ్మరింపును) అగ్నిలో బాప్తిస్మమని రెండో మారు ప్రస్తావించవలసిన అవసరం యోహానుకు ఏముంది?
దీన్నిబట్టి, అది పరిశుద్ధాత్మను పొందుకోవడం గురించికాదని అర్థమౌతుంది, మరి అగ్నిలో బాప్తీస్మమంటే ఏమిటో ఆ క్రింది వచనంలో ఉంది చూడండి.
లూకా 3: 17
ఆయన చేట ఆయన చేతిలోనున్నది; ఆయన తన కళ్లమును బాగుగా శుభ్రముచేసి, తన కొట్టులో గోధుమలుపోసి, ఆరని అగ్నితో పొట్టు కాల్చి వేయునని అందరితో చెప్పెను.
ఇక్కడ గోధుమలు, పొట్టు అనేవి మనకి కనిపిస్తాయి, గోధుమలు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొంది(నడిపించబడి), ఆత్మఫలాలను ఫలించిన విశ్వాసులను సూచిస్తే, పొట్టు అగ్నితో కాల్చబడే అవిశ్వాసులను సూచిస్తుంది. అగ్నిలో బాప్తిస్మమివ్వడమంటే అవిశ్వాసులను తీసుకెళ్ళి నరకంలో వేస్తాడని (తీర్పుతీరుస్తాడని) అర్థం, ఈ ప్రకారంగా అగ్నిలో బాప్తిస్మం పొందేవారు విశ్వాసులు కాదు, అవిశ్వాసులు.
మత్తయి 13: 41
మనుష్య కుమారుడు తన దూతలను పంపును; వారాయన రాజ్యములోనుండి ఆటంకములగు సకలమైనవాటిని దుర్నీతిపరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు.