క్రైస్తవునికి దెయ్యం పడుతుందా?
ఈ అంశంపైన ఒకరికున్న కొన్ని సందేహాలు తీర్చాలనే కారణంతోనే ఈ వ్యాసాన్ని నేను రాస్తున్నాను. ఈ ప్రశ్న గతంలో నాలో కూడా చాల కాలం ఉండేది .నేను దేవుని పరిచర్యకోసమని పలు గ్రామాలకి వెళ్ళినప్పుడు దీనిగురించి ఎన్నో కథనాలు వినేవాన్ని.
ఈ అంశాన్ని మనం పరిశీలించడానికి ముందు, దెయ్యాలు ఉన్నాయనేది, అవి చురుకుగా పనిచేస్తుంటాయనేది నిజమని గ్రహించడం చాలా అవసరం. దయ్యం ఒక కల్పిత పాత్ర కాదు. సాతానును ఆరాధించే సంఘాలు మరియు సాతాను శక్తులను ఆహ్వానించే సంఘాలు కూడా నేటికాలంలో ఉన్నాయి. ఈ సంఘాలు క్రీస్తు కట్టిన సంఘాలు కావు.
మత్తయి 9: 32 లో యేసుక్రీస్తు మరియు ఆయన శిష్యులూ వెళ్తుండగా కొందరు, దయ్యం పట్టిన యొక మూగవాన్ని ఆయనవద్దకు తీసుకునివచ్చినట్టుగానూ , యేసుప్రభువు ఆ దెయ్యాన్ని వెళ్లగొట్టినట్టుగానూ చూస్తాం, అయితే ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే దయ్యం ఒక విశ్వాసిలో నివాసం చేస్తుందా? కొంతమంది నివాసం చేస్తుందని అంటారు. వారి స్పందనలు వారి ఆత్మాశ్రయ అనుభవం మీద ఆధారపడి ఉంటాయే కానీ దేవుని వాక్యం మీద కాదు.
క్రీస్తు మరియు అపొస్తలులు మాత్రమే దెయ్యాలను తరిమికొట్టారు, ప్రతీ సందర్భంలోనూ, దెయ్యం కలిగి ఉన్నవారు అవిశ్వాసులే. క్రొత్త నిబంధనలో ఎప్పుడూ, అపొస్తలులు విశ్వాసుల్లోని దెయ్యాలను బంధించడం లేదా తరిమికొట్టడం మనం చూడము. పత్రికల్లో కూడా విశ్వాసి నుండి లేదా అవిశ్వాసి నుండి దెయ్యాలని తరిమికొట్టమని ఎక్కడా వ్రాయబడలేదు.
దేవుని వాక్యం యొక్క సామూహిక బోధన ఏమిటంటే, దెయ్యాలు నిజమైన విశ్వాసిలో ప్రాదేశికంగా నివసించలేవు. ఈవిషయం మనకి 2 కొరింథీయుల 6 :15-16 లో స్పష్టంగా , దేవుని ఆత్మ (పరిశుద్ధాత్మ ) , దెయ్యాలు కలిసి నివసించలేవని సూచిస్తుంది.
2 కొరింథీయుల 6 :15-16
క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది?
దేవుని ఆలయ మునకు విగ్రహములతో ఏమిపొందిక? మనము జీవముగల దేవుని ఆలయమై యున్నాము; అందుకు దేవుడీలాగు సెల విచ్చుచున్నాడు.నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై యుందును వారు నా ప్రజలైయుందురు.
కొలొస్సయులకు1: 13 లో కూడా “ఆయన మనలను అంధకారసంబంధమైన అధికారములోనుండి విడుదలచేసి, తాను ప్రేమించిన తన కుమారునియొక్క రాజ్యనివాసులనుగా చేసెను.” అని పౌలు చెప్పాడు. రక్షణ మనకు సాతాను నుంచి విముక్తి కలిగించింది, క్రీస్తు రక్తం మనల్ని అంధకారసంబంధమైన అధికారంలో నుండి విడుదల కలిగించింది.
రోమా 8: 37 లో, పౌలు,క్రీస్తు ద్వారా మనం అత్యధిక విజయం పొందియున్నామని చెప్పాడు.
1 కొరింథీయులకు 15:57 లో, యేసుక్రీస్తు మూలంగా మనకు విజయమని చెప్పాడు.
‘అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక.’
1 యోహాను 2:13 లో మనం క్రీస్తుని ఎరిగి ఉన్నాం కనుక దుష్టుని జయించియున్నామని రాయబడింది.
అదే 1 యోహాను 4:4 లో మనం దేవుని సంబంధులం కనుక ; మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మనం వారిని జయించియున్నామని రాయబడింది.
వాక్యం బోధించే ఈ అద్భుతమైన సత్యాలను ఎవరైనా ఎలా విస్మరించగలరు, దెయ్యాలు నిజమైన విశ్వాసుల్లో నివసించగలవని ఎలా నమ్ముతారు?
ఆఖరిగా, 1 యోహాను 5:17లో మనం దేవునిమూలంగా పుట్టినవారం కనుక దుష్టుడు వాని ముట్టడన్న గొప్ప సత్యం విశ్వాసులుగా మనం నమ్మక తప్పదు.
1 యోహాను 5:17
దేవుని మూలముగా పుట్టియున్న వాడెవడును పాపము చేయడని యెరుగుదుము. దేవునిమూలముగా పుట్టినవాడు తన్ను భద్రముచేసికొనును గనుక దుష్టుడు వాని ముట్టడు.
పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిలో నివసించినప్పుడు, ఏ దెయ్యం వాడిలో ఇల్లు కట్టలేదు. దెయ్యం ఒకనిలో నివసించడమంటే నిజమైన రక్షణ లేదనడానికి నిదర్శనం.