మనము ఎలా ఆరాధిస్తామో దేవుడు పట్టించుకుంటాడా?
మనము అనగా సంఘము దేవుడిని ఏ విధంగా మహిమ పరుస్తున్నాము అనే విషయంలో దేవుడు శ్రద్ధ కలిగి ఉంటాడు. అందుకే మనము ఆయనను ఏ విధంగా మహిమ పరచాలో బైబిల్ లో మన కొరకు రాయించాడు. మనము మనకు ఇష్టం వచ్చినట్లు దేవుడిని మహిమ పరచడానికి వీలు లేదు. ఆయనను ఏ విధంగా ఆరాధించాలో బైబుల్లో ఆయన కొన్ని సూత్రాలని, విధానాలని మన కొరకు రాయించాడు.
ఆరాధన అనగా దేవుడు మనకిచ్చిన నియమ నిబంధనలను జాగ్రత్తగా పాటించడం ద్వారా దేవునిని మనము మహిమ పరచడం.
మనము ఏ విధంగా ఆరాధిస్తున్నాము అనేది మనము ఎవరిని ఆరాధిస్తున్నాము అనే విషయాన్ని తెలియజేస్తుంది. ఎవరైనా ఒక వ్యక్తి గురించి ఎంత ఎక్కువగా మనము నేర్చుకుంటే అంత ఎక్కువగా ఆయనతో స్నేహంలో ఎదుగుతాము.
అలాగే దేవుని గురించి నీవు ఎంత ఎక్కువగా నేర్చుకుంటే అంత ఎక్కువగా ఆయన నీవు ఆరాధించగలుగుతావు, ఆయనతో సహవాసంలో ఎదుగుతావు.
ఆయన ఇచ్చిన క్రమములో మనము ఆయనను ఆరాధించకపోతే ఏం జరుగుతుంది?
- లేవీయకాండము 10:1-3 లో నాదాబు అభిహులు యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తెగా యెహోవా వారిని కాల్చివేశాడు అనే విషయాన్ని మనము చూస్తుంటాం.
- ఆదికాండం 4 లో కయీను యెహోవా చిత్తానుసారంగా అర్పించనందుకు ఆయన ఆ అర్పణను స్వీకరించలేదు.
- అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 5 వ అధ్యాయంలో సంఘము ద్వారా జరుగుతున్నటువంటి కార్యముల ద్వారా దేవుని నామానికి మహిమ కలుగుతున్నప్పుడు అననీయ మరియు సప్పీరాతో సంఘమును మోసపరిచి దేవునిని హృదయపూర్వకంగా ఆరాధించనందుకు వారిని శిక్షించాడు. మనము సంఘముగా కూడి ఆయనను ఆరాధించేటప్పుడు జాగ్రత్తగా ఆరాధించాలి. వాక్య ప్రమాణాలతో దేవుడు కోరుకున్నటువంటి ఆరాధనని మనము చేయాలి.
ఆరాధన అనగా సంఘము సహవాసానికి కూడుకున్నప్పుడు ఒక ప్రత్యేకమైన పాట పాడుతూ, అందరూ లేచి నిలబడి గట్టిగా చప్పట్లు కొడుతూ, గట్టిగా పాటలు పాడే ఆ యొక్క పది నిమిషాల సమయాన్ని ఆరాధన అని మనము పిలుస్తూ ఉంటాము. కానీ ఆరాధన అనగా సంఘముగా కూడి మీరు చేసేటువంటి ప్రార్థన,పాటలు పాడడం, వాక్యము చదవడం, వాక్యాన్ని ప్రకటించడము, వాక్యాన్ని వినడము, కానుకలు సమర్పించడము, ప్రభు బల్ల బాప్తిస్మములను ఇవ్వడం, మన తోటి సహోదరి సహోదరులతో సహవాసం చేయడము ఇదంతా కూడా ఆరాధనలో భాగమే. అంతేకాదు ఆదివారము మన సంఘ ఆరాధన అయిపోయిన తర్వాత మిగతా ఆరు రోజుల్లో నీవు జీవించేటువంటి జీవితం అంతా కూడా దేవునికి ఆరాధనగా నీవు బ్రతకాలి.
మలాకీ 1:6
కుమారుడు తన తండ్రిని ఘనపరచును గదా, దాసుడు తన యజమానుని ఘనపరచును గదా; నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయెను? నేను యజమానుడనైతే నాకు భయపడువాడెక్కడ ఉన్నాడు? అని సైన్యముల కధిపతియగు యెహోవా మిమ్మునడుగగా ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్యపెట్టితిమని మీరందురు.
మలాకీ 1:7
నా బలి పీఠము మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు, ఏమి చేసి నిన్ను అపవిత్రపరచితిమని మీరందురు. యెహోవా భోజనపు బల్లను నీచపరచినందుచేతనే గదా!
మలాకీ 1:10
మీలో ఒకడు నా బలిపీఠము మీద నిరర్థకముగా అగ్ని రాజబెట్టకుండునట్లు నా మందిరపు వాకిండ్లను మూయువాడొకడు మీలో ఉండినయెడల మేలు; మీయందు నాకిష్టములేదు, మీచేత నేను నైవేద్యమును అంగీకరింపనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.
దేవుడు మనల్ని నాకు రావాల్సిన మహిమ ఏమాయెను అని అడిగితే చాలామంది చెప్పే సమాధానం ఏమిటంటే, దేవా! ఏమి చేసి నీ నామమును మేము నిర్లక్ష్యం చేసాము? నిన్ను ప్రతి ఆదివారం మేము హృదయపూర్వకంగా నిన్ను ఆరాధిస్తున్నాను గట్టిగా చప్పట్లు కొడుతూ,గట్టిగా పాటలు పాడుతూ, నానా విధములైన వైద్యాలతో ఎంతో శబ్దంతో, రంగురంగు వెలుగుల నిచ్చే లైట్స్ సెట్టింగ్స్ తో, అందమైన బ్యాక్ గ్రౌండ్ డెకరేషన్ తో, లేటెస్ట్ స్టెప్పులతో నాట్యమాడుతూ నిన్ను ఆరాధిస్తున్నాము నీకు తెలియదా దేవా అని అంటూ ఉంటారు.
దానికి దేవుడనే సమాధానం ఎవరైనా మీ యొక్క సంఘ భవనపు తలుపులు మూసిన యెడల అది మేలు అని అంటాడేమో!
చాలామంది తాము వాక్యానుసారంగా ఆరాధించకపోవడం ద్వారా తమ మీదికి శిక్షను కొని తెచ్చుకుంటున్నారు. ఇలాంటి ఆరాధన చేయకపోయినా ఎడల మేలు. ఇలాంటి ఆరాధన చేయడము మన యొక్క శిక్ష విధికే తప్ప దేవుని నామానికి మహిమ కలగదు.
ఇలాంటి ఆరాధన చేయడం ద్వారా మనము పాపులర్ అవుతాము కానీ దేవుని యొక్క నామాన్ని పాపులర్ చేయడానికి ప్రయత్నించము. ఇలాంటి ఆరాధన చేయడం ద్వారా మన సంఘానికి ఎక్కువ మంది వస్తూ ఉంటారు కానీ పరలోక రాజ్యానికి చాలా తక్కువ మంది వస్తూ ఉంటారు. ఇలాంటి ఆరాధన చేయడం ద్వారా మీ రాజ్యం కట్టబడుతుంది కానీ దేవుని రాజ్యం కట్టబడదు.
పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలీయులకు ఆయనను ఏ విధంగా ఆరాధించాలో తెలియజేశాడు.
- నిర్గమకాండము 20:1-4 ఆజ్ఞలలో మొదటి రెండు ఆజ్ఞలు నీ దేవుడైన యెహోవాను నేనే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు.
- పాత నిబంధనలో ఏ విధంగా బలులు అర్పించాలి. ఏ విధంగా దేవాలయమును నిర్మించాలి, ఏ విధంగా హోమములు అర్పణములు చేయాలి, ప్రతిదీ కూడా చాలా సూక్ష్మంగా వివరంగా కొలమానాలతో వివరించడము జరిగింది.
- కొత్త నిబంధనలో కూడా మనము సంఘముగా ఆయనను ఏ విధంగా ఆరాధించాలో మన కొరకు రాయించాడు.
యోహాను సువార్త 4:24 “ఆత్మతో సత్యముతో ఆరాధింపవలెను”. సత్యము అనగా దేవుని యొక్క వాక్యము కాబట్టి. వాక్యాన్ని సరిగా ధ్యానించి వాక్య ప్రకారం మనము వాక్యాన్ని సరిగా ధ్యానించి వాక్య ప్రకారం మనము ఆరాధించాలి. మన సంఘాలలో వాక్యమును పాడాలి, వాక్యమును ప్రార్థించాలి, వాక్యమును బోధించాలి, వాక్య ప్రకారం నడవాలి.
వాక్య ప్రకారం నీవు దేవునిని ఆరాధించకపోతే నీవు విగ్రహారాధన చేస్తున్నట్లే. దేవుడు తనకు ఏ విధంగా మహిమ కలుగుతుందో మన కొరకు బైబిల్ లో రాయించాడు కాబట్టి ఆ వాక్య ప్రకారంగా మనము ఆరాధించితేనే ఆయన నామానికి మహిమ.
దేవుడు ఒకవేళ తాను ఏ విధంగా ఆరాధింపబడాలో నిర్ణయించే అవకాశం మానవులకి ఇస్తే మానవులు ఏం చేస్తారో తెలుసా? దేవునికి బదులు విగ్రహాలని తయారు చేసుకొని విగ్రహారాధన చేస్తాం. దేవుని మహిమను పక్కనపెట్టి మనము ఏవిధంగా మహిమ పొందుతామో ఆ పనులే చేస్తాము. మన సంఘములు సినిమా థియేటర్లు, క్లబ్బులు, పబ్బుల తయారవుతాయి. పాస్టర్స్ దేవుని స్థానాన్ని తీసుకుంటారు. ఈ విధంగా ఊహించలేని భయంకరమైన సంఘటనలని మనము చూడాల్సి ఉంటుంది.
కానీ దేవుడు తన అద్భుతమైన కృపని మన యెడల చూపించి, మన యొక్క మనస్తత్వాన్ని ఆయన ఎరిగి ఆయనను ఏ విధంగా ఆరాధించాలో ఆయన మన కొరకు బైబుల్లో తేటగా రాయించాడు. ఆయన రాయించిన మాటల అనుసారంగా కాకుండా మనము వేరే విధంగా ఆరాధిస్తే అది క్షేమకరము కాదు.
దయచేసి, ప్రియమైన సంఘమా, సంఘ కాపరులారా, సంగీతమును నడిపించే నాయకులారా, దయచేసి మీ ఆరాధన దేవుడు ఆశించిన రాయించిన విధంగా ఉందా లేదా అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించి వాక్యానుసారంగా ఆరాధించి దేవుని నామాన్ని మహిమ పరుస్తారు అని ఆశిస్తూ ఈ మాటలని మీకు రాస్తున్నాను.