విశ్వాస ప్రమాణము
బైబిల్, సంపూర్ణమైన, అన్ని విధాలుగా, అన్ని విషయలలో సరిపోయేటటువంటి వ్రాతపూర్వకమైన దేవుని ప్రత్యక్షత అని నమ్ముతున్నాము.
లేఖనములు దేవుని ప్రేరేపణ ద్వారా కలిగినవని మరియు అవి పూర్తి అధికారము కలిగినవని, ఆ అధికారము ఏదో సంఘము ద్వారానో, సంస్థ ద్వారానో లేదా ప్రమాణముల ద్వారానో సంక్రమించింది కాదు గాని కేవలము ఆ లేఖనములు దేవుని వాక్యమైయున్న కారణము చేతనే కలిగినదని నమ్ముచున్నాము. ఆ లేఖనములు దేవుడే స్వయముగా పలికిన మాటలు కాబట్టి దేవుని అధికారమును, దేవుని శక్తిని అవి కలిగి ఉన్నాయి.
మారని, మార్చబడని నిత్యుడయిన అద్వితీయ సత్యదేవుని ని మేము నమ్ముతున్నాము. ఆకాశమును, భూమిని అందలి సమస్తమునకు సృష్టికర్త దేవుడని నమ్ముచున్నాము. బైబిల్ లో వివరించబడిన దేవుడు అసమానుడు. ఆయనను ఎవరితోనూ, విశ్వము లోని మరి దేనితో నైనా పోల్చలేము. దేవుడు సకల అధికారము, సకల జ్ఞానము సమస్త వివేచన కలిగిన వాడు మరియు సమస్త మహిమ ఘనత ప్రభావములకు పాత్రుడు. సృష్టిలో జరిగిన ప్రతి సంఘటన దేవుని నిర్ణయము చేతనే జరిగినవని సమస్తమును అంతిమముగా దేవుని మహిమ కొరకే సంభవించునని నమ్ముచున్నాము.
దేవుడు అద్వితీయుడని (ఒక్కడే ) బైబిల్ బోధించుచున్నది. అయినప్పటికి ఈ ఒక్కడే దేవునిలోని దైవత్వమును ముగ్గురు వ్యక్తులు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు కలిగి యున్నారు. వారిలో ప్రతి వ్యక్తి కూడా సంపూర్ణముగా దేవునిగా వుండి దైవలక్షణాలు కలిగి యున్నారని లేఖనములలో చెప్పబడింది. తండ్రి, కుమారుడు, పరిశుద్దాత్ముడు నిత్యులై వుండి త్రిత్వము అనే పదముతో వివరించబడుతున్నారు. మానవుడు దేవుని స్వరూపములో సృష్టించబడ్డాడని మేము నమ్ముచున్నాము.
మానవుడు తన సృష్టికర్తకు విరోధముగా తిరుగుబాటు చేసి పాపములో పడిపోయాడు. దాని ఫలితముగా మానవుడు ఆత్మీయముగా చనిపోయి దేవుని వెదకుటకు ఏ మాత్రము ఇష్టము లేని వాడై నిజముగా చెప్పాలంటే దేవుని వెదకుటకు శక్తి లేని వాడై యున్నాడు. దేవుడు నిత్యత్వము నుండి సమస్తమును ముందుగానే నిర్ణయించిన వాడై కొంతమంది ప్రజలను ఏర్పరచుకొని వారిని వారి పాపములనుండి క్రీస్తుయేసు విమోచించుట ద్వారా తాను మహిమ పొందవలెనని వారిని క్రీస్తుయేసు కు అనుగ్రహించియున్నాడు.
దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఈ ఏర్పరుచుకొనబడిన ప్రజల స్థానములో వారికి బదులుగా మరణించి కలువరి శిలువ మరణము ద్వారా వారికి సంపూర్ణమైన పాపక్షమాపణ అనుగ్రహించి యున్నాడు. ఆ కలువరి శిలువ కార్యము తప్ప మరే కార్యము పాపక్షమాపణను కలుగ చేయదు, మరియు ముగించబడిన సంపూర్ణమైన క్రీస్తు కార్యమునకు మరే కార్యమునుకూడా చేర్చలేము.
దేవుడు తన కృప కనికరముల విషయములో సార్వభౌముడై, పాపాత్ములైన మనుష్యులను వారి సొంత క్రియల ద్వారా కాక పరిశుద్ధాత్మ శక్తి ద్వారా తిరిగి జన్మింపజేసి నూతన జీవమును అనుగ్రహించునని మేము నమ్ముచున్నాము. దేవుడు వారికి విశ్వాసమును, పశ్చాత్తాపమును వరములుగా వారికి అనుగ్రహించునని ఆ వరముల ద్వారా మనుష్యులు దేవుని ప్రేమ చేత క్రీస్తు నందు నమ్మిక యుంచి వారి పాపముల నుండి తిరిగెదరని నమ్ముచున్నాము. ఆ విశ్వాస ఫలితముగా ప్రభువైన యేసుక్రీస్తు బలియాగమును బట్టి దేవుడు నమ్ము వారిని నీతిమంతులుగా తీర్చును. ఏర్పరచబడిన వారి జీవితాలలో దేవుడు అనుగ్రహించు విశ్వాసమనే వరము మరియు ఎడతెగని పరిశుద్ధాత్ముని కార్యము ద్వారా సత్క్రియలు బయలుపరచ బడునని నమ్ముచున్నాము.
ఈ సత్క్రియలు నిజమైన రక్షింప శక్తి గల విశ్వాసము ద్వారానే జరిగింపబడును. ఈ సత్క్రయలు నిజ విశ్వాసము యొక్క ఫలితమే గాని దేవుని యెదుట నీతిమంతులుగా తీర్చబడుటకు ఆధారము కానేరవని, నీతిమంతులుగా తీర్చబడుట కేవలము విశ్వాసము ద్వారా కృప చేత మాత్రమే జరుగునది కావున ఏ శరీరియు అతిశయింప లేడని నమ్ముచున్నాము.
ఏర్పరచబడిన వారి సమూహామైన తన సంఘమును యేసుక్రీస్తుస్తాపించాడని మేము నమ్ముచున్నాము. తన సంఘము ఒక విధేయురాలైన వధువు వలె బైబిల్లో చెప్పబడిన రీతిగా దేవుని మాటకు లోబడును. క్రీస్తునందు విశ్వాసముంచు వారు తన శరీరమైన సంఘము నందు చేర్చబడుదురు. స్థానికసంఘము చాలా ప్రాముఖ్యమైనది మరియు ప్రతి విశ్వాసి సహవాసములో చురుకుగా పాల్గొనవలెను.
సజీవులైన వారికిని, మృతులైన వారికిని తీర్పు తీర్చుటకై మరల తిరిగి రానున్నాడని మేము నమ్ముచున్నాము. దైవప్రేరితమైన లేఖనములన్నిటిలో ఈ వాగ్ధానము కనబడుచున్నది. ఆయన తిరిగి వచ్చు పర్యంతము విశ్వాసులు యేసుక్రీస్తు ద్వారా దేవునికి మహిమకరమైన జీవితములు జీవించవలెను. సంఘము సువార్త ప్రకటన మరియు శిష్యులనుగా చేయుట యందు పని కలిగి నిర్మలమైన రాజీలేని క్రీస్తు సువార్తను దేవుని వాక్యము ద్వారా బోధించవలెను.