క్రీస్తు పునరుత్థానము గురించి తెలుసుకోవాల్సిన 4 విషయాలు.
ప్రపంచ చరిత్రలో క్రీస్తు యొక్క పునరుత్థానం తనదైన రీతిలో ఒక అద్భుతమైన స్థానాన్ని సంపాదించుకుంది. క్రైస్తవ్యంలో కూడా క్రీస్తు యొక్క పునరుత్థానం ఒక అద్భుతమైన సంఘటన.
కానీ నేటి క్రైస్తవులు దానిని కేవలం ఒక అద్భుతంగా మాత్రమే చూడడం చాలా విచారకరం. ఎందుకంటే మనం క్రీస్తు పునరుత్థానం యొక్క ప్రాముఖ్యత, అవసరత, విశిష్టతలను అర్ధం చేసుకోవడం ఎంతో ముఖ్యం.
క్రీస్తు పునరుత్థానం ఒక ముఖ్యమైన సిద్ధాంతం.
క్రైస్తవ్యంలో క్రీస్తు యొక్క పునరుత్థానం గురించిన సిద్ధాంతం చాల కీలకమైనది. పునరుత్థానాన్ని గురించిన విషయాలు , దాని ప్రాముఖ్యత యేసు క్రీస్తు ప్రభువే స్వయంగా బోధించాడు (మత్తయి 17: 22-23, లూకా 20:27-40). పాత నిబంధన విశ్వాసులు కూడా ఆయన పునరుత్థానం గురించి మాట్లాడినట్లుగా మనం చూస్తాము ( యోబు 19:25-27, కీర్తనలు 16:10, కీర్తనలు 110:1).
అలాగే యోహాను సువార్తలో ఆయన తానే పునరుత్థానమును జీవమును అని, తనయందు మాత్రమే విశ్వాసముంచువాడు చనిపోయినా సరే బ్రతుకుతాడని ప్రకటించాడు (యోహాను సువార్త 11:25). అపోస్తలులు క్రీస్తుని ప్రకటించేటప్పుడు కేవలం క్రీస్తు యొక్క మరణాన్ని మాత్రమే కాకుండా క్రీస్తు యొక్క పునరుత్థానాన్ని కూడా ప్రకటించారని 1 కొరింథీ 15:12, 1 కొరింథీ 15:2-3 లేఖనాలలో మనం చూడొచ్చు. అలాగే అపోస్తుల కార్యాలలో పేతురు ఇచ్చిన సువార్త ప్రసంగంలో కూడా పునరుత్థానం ప్రధానమైన అంశంగా ఉంది (అపో 2:22-31).
సువార్తలో క్రీస్తు యొక్క మరణం ఎంత ప్రాముఖ్యమో అదే ప్రాముఖ్యత పునరుత్థానానికి కూడా ఉంది. వాస్తవానికి పునరుత్థానం లేకపోతే మన రక్షణ అసంపూర్ణమైనదే ఔతుంది.
ఒకరు క్రైస్తవ విశ్వాసం కలిగి ఈ సిద్ధాంతాన్ని తిరస్కరిస్తే వారి విశ్వాసం వ్యర్థం ( 1 కొరింథీ 15:2). పునరుత్థానం లేకపోతే క్రైస్థవుడికి నిరీక్షణే లేదు. పునరుత్థానం గురించిన సిద్ధాంతం ప్రతీ క్రైస్తవుడు తెలుసుకోవలసిన ముఖ్యమైన సిద్ధాంతం.
యదార్ధ సంఘటనా లేక కల్పితమా?
క్రీస్తు మరణించి మూడవ రోజున తిరిగి లేసాడన్నది కట్టుకథ కాదు, ఒక యదార్ధ సంఘటన. చరిత్రలో నిరూపించబడిన సంఘటన. ఈ సంఘటన జరగలేదన్నట్లుగా , నిజాన్ని దాచే ప్రయత్నం ప్రస్తుత కాలంలో చేస్తున్నారంటే ఆశ్చర్య పడాల్సిన అవసరము లేదు. ఇలాంటి ప్రయత్నం బైబిల్లో కూడా మనం చూడొచ్చు ( మత్తయి 28:11-15), సిలువలో మరణించిన క్రీస్తు శరీరాన్ని సమాధి చేసినప్పుడు దానికి కాపలాగా సైనికులను ఉంచమని యూదామత ప్రధానులు పిలాతును కోరతారు (మత్తయి 27:61-66), ఆదివారం తెల్లవారుచుండగా స్త్రీలు ఆ సమాధిని చూడడానికి వచ్చినప్పుడు, అప్పటికే క్రీస్తు మృత్యుంజయుడౌతాడు.ఈ విషయం తెలిసిన ప్రధానయాజకులు కాపలాగా ఉన్న ఆ సైనికులకు లంచం ఇచ్చి వారు నిద్రపోతుండగా క్రీస్తు శిష్యులు రాత్రివేళ వచ్చి క్రీస్తుని ఎత్తుకుపోయరన్న అబద్ధాన్ని ప్రకటించమని చెబుతారు. ఇలాంటి కట్టుకథలు ఎన్ని వచ్చినా క్రైస్తవ చరిత్రకారులు మాత్రమే కాకుండా మతరహిత విద్యా పండితులు కూడా ఇది కట్టు కథ కాదని, నిజంగా జరిగిన సంఘటన అని నిర్ధారించారు. అమెరికాలో వృత్తి రీత్యా పేరు పొందిన లీ స్ట్రాబెల్ అనే జర్నలిస్ట్ క్రీస్తు దేవుడు కాదు, ఆయన అసలు మరణించలేదు, ఆయన పునరుత్థానం అనేది ఒక భ్రమయని నిరూపించే ప్రయత్నం చేసాడు. అతను ఒక నాస్తికుడు కూడా .
లీ స్ట్రాబెల్ చేసిన మిక్కుటమైన పరిశోధనలో చివరికి క్రీస్తు ఒక కల్పిత పాత్ర కాదు, అయన దేవుని కుమారుడు, అయన మరణం , అయన పునరుత్థానం నిరాకరించరాని సత్యాలని తేలింది. దానిని ఆయన ఆధారాలతో సహా నిరూపించాడు. నాస్తికుడిగా ఉన్న అతను ఇప్పుడు దేవుని పరిచర్య చేస్తున్నాడు.
న్యాయస్థానంలో ప్రత్యక్ష సాక్షుల కథనాలకి ఎక్కువ విలువ ఉంటుంది. వారి సాక్ష్యం కంటే ఇంకొక బలమైన సాక్షం ఎక్కడా ఉండదు. క్రీస్తు యొక్క పునరుత్థానం గురించిన ప్రత్యక్ష సాక్షాలు మనకు బైబిల్లో చాలా కనిపిస్తాయి. మత్తయి 28:1-10, 16-20 లో కొందరు క్రీస్తును ముఖాముఖిగ చూసి ఆయనతో మాట్లాడిన సంఘటనలు మనం చూస్తాము. అలాంటి సాక్షాలలో లూకా సువార్తలో లూకా వివరించిన పునరుత్థాన వృత్తాంతం అన్నిటికీ మించిన ఒక అద్భుతమైన రుజువుగా నిలిచింది. ఇక్కడ ఒక ముఖ్యమైన హెచ్చరిక ఏంటంటే, లూకా సువార్త తప్ప మిగిలిన అన్ని సువార్త వృత్తాంతాలు నమ్మదగినవి కావని చెప్పే ఉద్దేశం కాదని గమనించాలి.
ఆ సువార్తను రాస్తున్న లూకా ఒక వైద్యుడు మరియు సంఘ చరిత్రలో మంచి పేరు నొందిన చరిత్రకారుడు కూడా. అయన యొక్క కథనాలు, పునరుత్థాన వృత్తాంతం పరిశీలనలోకి వచ్చినా చివరికి యేసుక్రీస్తు పునీతుడిగానే నిలిచాడు. పురావస్తు తత్త్వశాస్త్రజ్ఞుల మధ్య లూకాకి ఎంతో ఘనత ఉంది. అలాగే అతను దేవునిచే నియమింపబడ్డ అపొస్తలుడైన పౌలుతో చాల సన్నిహితంగా నడిచినవాడు.
అతను క్రీస్తు జీవితాన్ని దగ్గరగా ఉండి చాల పరిశీలించి, పరిశోధించి, ప్రత్యక్ష సాక్షుల యొక్క సాక్షాధారాలను కూడా జాగ్రత్తగా పరిశీలించి , నిర్ధారించుకుని ఆ సువార్తని రాయడమే కాకుండా (లూకా 1:1-4) . తాను రాయబోయే సంగతుల గురించి అవి “నిశ్చయముగా జరిగినవని” సాక్షమిస్తాడు (లూకా 1:1-4). క్రీస్తు యొక్క మరణం ఎంత నిజమో , క్రీస్తు పునరుత్థానం కూడా అంతే నిజం. దానిలో అనుమానించాల్సిన పని లేదు.
పునరుత్థానం – సువార్త పురోగతి
క్రీస్తుయొక్క పునరుత్థానం అపొస్తలుల యొక్క విశ్వాసాన్ని బలపరచింది, దృఢపరిచింది. యేసు తన శిష్యులను ఎన్నుకున్నప్పుడు, అతను గొప్ప విశ్వాసం గల వ్యక్తులను ఎన్నుకోలేదు. వారు మనలాగే సాధారణమైన జీవితాన్ని జీవిస్తున్న సాధారమైన మనుషులు. వారి విశ్వాసం కూడా మనలాగే బలహీనమైనది. వారు ఎన్నో సార్లు అవిశ్వాసానికి గురయ్యారు. మరెన్నోసార్లు వారి అపనమ్మకాన్ని బట్టి క్రీస్తు వారిని గద్దించాడు (మార్కు 16:14, మత్తయి 8:23). మనలాగే వారికీ భయాలు, బలహీనతలు ఉన్నాయి. రోమా సైనికులు క్రీస్తుని అపహరించడానికి వచ్చినప్పుడు వారంతా పారిపోయారు (మత్తయి 26:56). అపోస్తలుడైన పేతురు భయంతో మూడు సార్లు క్రీస్తుని తృణీకరించాడు. (మత్తయి 26:69-75) . క్రీస్తు తన పునరుత్థానం గురించి వారికి ముందుగానే చెప్పినప్పటికీ వారు సందేహంలో ఉన్నారు. (మత్తయి 17:17, మార్కు 16:11-13, మత్తయి 28:17). చివరికి పునరుత్థానమైన యేసును వారు చూసినప్పుడు ఇదంతా మారిపోయింది. వారు ఎంతో ధైర్యపరచబడ్డారు. క్రీస్తు బోధించిన సంగతులు నిజమే అని వారికి నిశ్చయమైంది. క్రీస్తు దేవుని కుమారుడు అని మాత్రమే కాకుండా , ఆయన దేవుడని కూడా వారికి నిశ్చయమైంది. వారి విశ్వాసం బలపడింది.కాబట్టి అప్పటినుంచి క్రీస్తు వారికి అప్పగించిన పనిలో ఎంతో నిమ్మగ్నమైయ్యారు. క్రీస్తు తన మరణానికి ముందు తన శిష్యులతో గడిపిన సమయంతో పోలిస్తే పునరుత్థానం తర్వాత వారితో గడిపిన సమయం చాలా తక్కువ , అయినప్పటికీ ఆ సమయం వారిలో ఎనలేని ధైర్యాన్ని ఇచ్చింది.
మూడు సార్లు భయంతో తన నోటితో క్రీస్తుని తృణీకరించిన పేతురు, అదే క్రీస్తుని నిర్భయంగా ప్రకటించాడు సంఘానికి ఒక నాయకుడయ్యాడు. యూదా జనాంగానికి సువార్తని తీసుకెళ్ళడానికి ఒక నోటిబూరగా మారాడు.
అందుకే సువార్తని నిర్భయంగా, దృఢ నమ్మకంతో ప్రకటించడానికి పునరుత్థానం ఒక బలమైన కారణం అని చెప్పొచ్చు (అపో 23:5, అపో 24:20-21). వారు క్రీస్తు తిరిగి లేచాడన్న గట్టి సాక్షాన్ని కలిగి సువార్త విస్తరణ కొరకు ఎన్నో అవమానాలను ,తప్పుడు ఆరోపణలను ఎదుర్కొని , వారి ప్రాణాలను సైతం పనంగా పెట్టి క్రీస్తు మరణాన్ని, పునరుత్థానాన్ని గురించి నిర్భయంగా, విశ్వాసంగా ప్రకటించారు. (అపో 3:15,అపో 4:1-3, అపో 4: 33, 1 కొరింథీ 15: 15). అపొస్తలుల విశ్వాసానికి క్రీస్తు యొక్క పునరుత్థానం మూలాధారమైనది.
క్రీస్తు పునరుత్థానుడవ్వకపోతే క్రైస్తవ విశ్వాసం అసంపూర్ణమైనది.
క్రీస్తు యొక్క పునరుత్థానంతో క్రైస్తవ విశ్వాసానికి గల సంబంధం
పునరుత్థానం సంపాదించిన అద్భుతమైన ఫలితాలను బట్టి ఇప్పటివరకూ మనం పునరుత్థానం క్రైస్తవ్యంలో ఒక ప్రాముఖ్యమైన సిద్ధాంతమని, అది ఒక కల్పిత సంఘటన కాదని ఇంకా మరికొన్ని విషయాలను చాలా క్లుప్తంగా చూసాం.
ఆఖరిగా మరో ముఖ్యమైన అంశాన్ని ఇప్పుడు చర్చిద్దాం. అదేంటంటే క్రీస్తు యొక్క పునరుత్థానంతో క్రైస్తవ విశ్వాసానికి గల సంబంధం, దాని యొక్క పాత్ర , అవసరత, విశిష్టతలు దాని ఫలితాల గురించి చూద్దాం.
-
పునరుత్థానములో క్రీస్తు యొక్క దైవత్వం నిరూపించబడింది ( రోమా 1:4-5)
-
తండియైన దేవుని మహిమను, ఔన్నత్యాన్ని చాటిచెప్పింది ( అపో 2:23-24, రోమా 6:4)
-
తండ్రి యొక్క చిత్తాన్నీ నెరవేర్చుటలో తాను క్రీస్తు చూపించిన విధేయత పరిపూర్ణమైనది ( యోహాను 10: 17-18)
-
క్రీస్తు యొక్క పాపపరిహార కార్యాన్ని తండ్రిఐన దేవుడు అంగీకరించాడనడానికి ఇది నిదర్శనం ( రోమా 4:25)
-
జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు ( 1 పేతురు 1:4)
-
క్రీస్తు యందు విశ్వసించువారు పాపముచే నశింపబమన్న విశ్వాసాన్ని ఇచ్చింది ( 1 కొరింథీ 15:17-18)
-
క్రీస్తు యేసులో ఉన్నవారికి శిక్షావిధి ఉండదు అన్న నమ్మకం. ( రోమా 8:1-11, 33-34)
-
పరిశుద్దాత్మ దేవుడు (ఆదరణకర్త) మనలో నివసింపచేసి సంఘముగా చేయుటకు మార్గాన్ని తెరిచింది ( యోహాను 16:7)
-
సంఘానికి శిరస్సుగా మరియు సృష్టికి పాలకుడిగా క్రీస్తును ప్రకటించింది ( ఎఫెసీ 1:20- 22)
-
విశ్వాసులందరికీ భవిష్యత్తులో పునరుత్థాన జీవితం ఉంటుందన్న హామీ ఇచ్చింది. ( యోహాను 5:26-29, 14:19, రోమా 4:25, 6:5-10, 1 కొరింథీ 15:20-23).
క్రీస్తు యొక్క పునరుత్థానం కంటే గొప్పదైన సంఘటన మన రక్షణలో ఏమి లేదు. ఎందుకంటే, అది క్రీస్తు యొక్క త్యాగపూరితమైన మరణం యొక్క ఉద్దేశాన్ని రూఢిపరచి సంపూర్ణపరిచింది. దేవుని రాజ్య విస్తరణ, పురోగతికి నాంది పలికింది. కాబట్టి దేవుడు మృతులలోనుండి క్రీస్తుని లేపాడని హృదయంలో విశ్వాసిస్తేనే మనకి రక్షణ (రోమా 10: 9-10).