మార్కు సువార్త 1:15 లో “కాలము సంపూర్ణమైయున్నది, దేవునిరాజ్యము సమీపించి యున్నది ; మారుమనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు, గలిలయకు వచ్చెను”. ఇక్కడ “మారుమనస్సు” అన్న పదానికి “మెటానోయా” అన్న గ్రీకు పదం వాడారు. “మెటానోయా ” అంటే పశ్చాత్తాపం తో దేవుని వైపు చూస్తూ మన మార్గాన్ని , హృదయాన్ని మనసుని మార్చుకోవడం.
పాపాన్ని లేదా తప్పులను దేవుని యెదుట ఒప్పుకున్నంత మాత్రాన మారుమనస్సు పొందాము అనుకోవడం పొరపాటే
దైవచిత్తాను సారమైన దుఃఖము మారు మనస్సును కలుగజేస్తుంది. ఇక్కడ ఒక విషయాన్నీ గ్రహించాలి . దుఃఖము చాల రకాలుగా ఉంటుంది. ఒక చెడ్డ పని చేసి దానికి తగిన శిక్ష వచ్చినప్పుడు దుఖం కలిగుతుంది. మన ఆప్తులైన వారు ఈ లోకాన్ని విడచివెళ్లినప్పుడు దుఃఖం కలుగుతుంది. ఒక తప్పు చేసినప్పుడు ,దానిని గ్రహించి ఒప్పుకొన్నపుడు దుఃఖం వస్తుంది. ఇలాగ రకరకాల అనుభవాలనుంచి మనకు దుఃఖం కలగవచ్చు . కానీ ఇది దైవచిత్తాను సారమైన దుఃఖము కాదు. పాపాన్ని లేదా తప్పులను దేవుని యెదుట ఒప్పుకున్నంత మాత్రాన మారుమనస్సు పొందాము అనుకోవడం పొరపాటే. అది మనస్పూర్తిగ చేసిన ఒప్పుదలే కావచ్చు కానీ జీవితం మారకపోతే అది దేవుడు కోరుకొనే మారుమనస్సు కాదు.
దైవచిత్తాను సారమైన దుఃఖము పరిశుద్దాత్మ ప్రేరణతో వస్తుంది. అది మన పరిస్థితులను బట్టి కాక మన పాపస్థితిని గ్రహించి , దేవుని ప్రేమను కనుకొన్న వారముగా , మన పాపములు ఒప్పుకొని పరిశుద్ధ మైన దేవునిని క్షమించ మని వేడే ప్రార్ధన . ఇది అసలైన పశ్చాత్తాపం. ఇది కేవలం మన తప్పు చేసాము అన్న గ్రహింపుతో ఆగిపోదు , అది మన జీవిత విధానాన్ని కూడా మారుస్తుంది. ఎవరైతే ఇలాంటి పశ్చాత్తాపంతో ఉన్నారో ఒక నూతన సృష్టి. మన ప్రతి ఆలోచన, ప్రతి అడుగు దేవుడ్ని మహిమ పరచడానికి ప్రాకులాడుతుంది . పాపమ చేయడానికి ఇష్టపడడు .నిజమైన మారుమనస్సు గలవారు పాపాన్ని ద్వేషించి దేవుని తట్టు తిరుగుతారు(1 థెస్సలొనీకయులకు 1:9). కష్టాలలో ,ఇబ్బందులలో దేవుని మీద ఆధారపడతారు .ఈ మార్పు ప్రార్ధనను నిర్లక్ష్యం చేయదు. సహా విశ్వాసుల యొక్క ఉనికిని ఇష్టపడుతుంది. వారి దృక్పధం మారుతుంది. వాక్యాన్ని ప్రేమిస్తుంది. తన శైలిలో ఉన్నవారినే కాకుండా ఇతరులను కూడా ప్రేమిస్తుంది. నిజమైన మరుమనస్సుకి ఇవి కొన్ని సూచనలు. ఇవి దైవచిత్తాను సారమైన కార్యములు. ఇటాంటి మార్పులు మీరు మీ జీవితంలో చూస్తున్నారా?లేదా ఎప్పటివలె మాటలు, పనులు, ఆలోచనలు ఉన్నాయా? దీనికి సమాధానం మన స్వీయ పరిశీలనలో బయలపడవచ్చును.
మారుమనస్సు రక్షణ అనుభవం లోనికి తెస్తుంది. 2 కొరింథీయులకు 7:10 లో “దైవచిత్తాను సారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును; ఈ మారుమనస్సు దుఃఖమును పుట్టించదు. అయితే లోకసంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. ”
మారుమనస్సు, రక్షణ ఈ రెండు దేవుడు ఇచ్చే బహుమానాలు(అపొస్తలుల కార్యములు 11:18,2 తిమోతికి 2:25) . మారుమనస్సు క్రైస్తవ జీవితానికి లో ఒక ముఖ్యమైనదే కాదు (లూకా 13: 1-5) , అది మన రక్షణకు మూలము (మార్కు 1:15). దైవచిత్తాను సారమైన దుఃఖము( పశ్చాత్తాపం)) లేనిదే రక్షింపబడ్డాము అనుకోవడం పొరపాటె . మారు మనస్సు లేనిదే క్షమాపణ లేదు.
ఈనాడు ఇలాంటి “దైవచిత్తాను సారమైన దుఃఖము”ను గూర్చి బోధించే సంఘాలు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. క్రీస్తుని గూర్చిన వార్త, పాపమునకు వచ్చు జీతము గురించి, వాక్యానుసారమైన పశ్చాత్తాపాన్ని గురించి తప్ప అన్ని విషయాలు బోధ చేస్తున్నారు. ఇలాంటి బోధ వలన సంఘము తప్పుడు విశ్వాసులను తయారు చేస్తుంది. చాలా సంఘాలు భౌతిక మరియు మానసిక ఆరోగ్య కేంద్రాలుగా మారిపోయాయి. ఇది దేవుని చిత్తము కాదు. ఇలాంటి సంఘాలకు దూరంగా ఉండాలి.
మారు మనస్సుకి సంబంధించిన మరొక ముఖ్యమైన విషయము ఏమిటంటే, మనము పశ్చాత్తాపం కేవలం రక్షింపబడిన సమయంలో ఒకసారే జరిగే క్రియ అనుకుంటారు , ఇది కొంతవరకు నిజం అయినప్పటికీ ఇది రోజువారీ ప్రక్రియ కూడాను .మన మనస్సు కేవలం రక్షింపబడినప్పుడు మాత్రమే మార్పు జరగదు, అప్పుడు మొదలవుతుందే కానీ అది జీవిత ప్రక్రియ. పశ్చాత్తాపం, పవిత్రీకరణకు ఒక భాగం కూడా . క్రీస్తు శక్తితో మనం పాపం నుండి విముక్తి పొందాము, కాని మనం ప్రతి రోజు చేసే పాపంతో వ్యవహరించాలి. ప్రతి రోజు మన పాపాలని ఒప్పుకొనుట వలన క్రీస్తు యొక్క రూపములో ఎదుగుతాము.(రోమా 8:28, రోమా 12:2)
చివరగా, నా అభిమాన వేదాంతవేత్త ర్. సి స్ప్రౌల్ ఈ విషయమై తన పుస్తకములో ఇలా అన్నారు ,
“పశ్చాత్తాపం, క్షమాపణకు గురించే కాదు అది ప్రక్షాళన గురించి కూడా. మనము అవినీతిపరులము కనుక మనకి ప్రక్షాళన అవసరం. పశ్చాత్తాపం విశ్వాసానికి ఐచ్ఛిక అనుబంధంగా భావించడానికి మనం ప్రలోభపడవచ్చు. మనము విశ్వాసము చేతనే నీతిమంతులముగా తీర్చబడుతాము అంతమాత్రాన పశ్చాత్తాపం మినహాయించదు. పశ్చాత్తాపం (మారుమనస్సు) బైబిల్లో ఒక స్పష్టమైన భావన మాత్రమే కాదు అది రక్షణకు మూలము”
కనుక ప్రతి రోజు మనము చేసే పాపాలను బట్టి దేవుని యెదుట పశ్చాత్తాపం పొందడం మన క్రైస్తవ జీవితానికి నిత్యవసరం.