పాపం అంటే ఏంటి?
బైబిల్ లో మానవజాతి చరిత్రను పరిశీలించినప్పుడు వారంతా చాలా మట్టుకు పాపంలో జీవిస్తూ దేవునికి విరుద్ధంగా జీవిస్తున్నారు. కానీ దేవుడు వారిని రక్షించాలనీ వారిని తన యొద్దకు తీసుకురావాలనే ప్రణాళికను కలిగియున్నాడు. కాబట్టి మనం పాపం అంటే ఏమిటి? అది దేవుని నుండి మనల్ని ఎలా వేరు చేస్తుంది? అనేది తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం.
పాపం అంటే ఏమిటి?
పాపం అంటే మనం ఏం చేస్తున్నామో ఏం ఆలోచిస్తున్నామో అనేవాటి విషయంలో దేవుని నీతినియమాలను పాటించకపోవడం. ఇది కేవలం దొంగతనం లేదా అబద్దాలు చెప్పడమే కాకుండా దేవుడు మననుండి ఏదైతే కోరుకుంటున్నాడో దానికి వ్యతిరేక ధోరణిలో ప్రవర్తించడం. అంటే మన మనస్తత్వం, మన కోరికల విషయంలో కూడా. ఉదాహరణకు పది ఆజ్ఞల్లో పొరుగువాడిది ఏది ఆశింపకూడదు అని చెప్పబడింది “నీ పొరుగువాని యిల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని యెద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పెను” (నిర్గమకాండము 20:17). ఈ నియమం దొంగతనం చెయ్యాలనుకోవడం లేదా వ్యభిచారం చెయ్యాలనుకోవడం కూడా దేవుని దృష్టికి పాపమే అని తెలియచేస్తుంది.
పాపపు వైఖరి
యేసుక్రీస్తు కొండమీది ప్రసంగంలో ఈ పాపపు వైఖరి గురించి హెచ్చరించారు. అక్కడ ఆయన కోపాన్ని కలిగియుండడం (మత్తయి 5:22) లేదా కామసంబంధమైన (మోహపు) చూపులు కలిగియుండడం (మత్తయి 5:28) కూడా పాపమే అని బోధించారు. పౌలు కూడా మనస్తత్వ వైఖరికి సంబంధించిన కొన్నిటిని పాపంగా పేర్కొన్నాడు అవేంటంటే అసూయ, కోపం, మరియు స్వార్థం (గలతీ 4:20). దీనినిబట్టి మన జీవితం దేవునికి నచ్చేవిధంగా ఉండాలంటే మన క్రియలు మరియు అంతేకాకుండా హృదయ ఆలోచనలు కూడా పరిశుద్ధంగా ఉండాలని అర్థమౌతుంది.
ప్రాముఖ్యమైన ఆజ్ఞ
ఆజ్ఞలన్నిటిలో “నీవు నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణవివేకముతోను, నీ పూర్ణబలముతోను, నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను” (మార్కు 12:30) అనేది ప్రాముఖ్యమైన ఆజ్ఞ. దీని అర్థం ఏంటంటే మన హృదయ ఆలోచనలు లేక స్వభావం దేవుని నియమాలకు అనుగుణంగా ఉండాలి. క్రీస్తును అంగీకరించడానికి ముందు మనం కేవలం పాపాలు చేసేవారంగా మాత్రమే కాదు మన స్వభావమే పాపంగా ఉన్నాము. పౌలు చెప్పినట్టు “మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను” (రోమా 5:8) మరియు “మనం స్వభావసిద్ధంగా ఉగ్రతకు పిల్లలం” (ఎఫెసీ 2:3). మనం ఒక అవిశ్వాసిని పరిగణలోకి తీసుకున్నా సరే అతను లేక ఆమె వారు నిద్రలో ఉద్దేశపూర్వకంగా పాపం చెయ్యనప్పటికీ స్వభావరీత్యా అది కూడా దేవుని దృష్టిలో పాపమే.
పాపం యొక్క తీవ్రత
పాపం అనేది చాలా తీవ్రమైన విషయం ఎందుకంటే అది మనల్ని లేక ఇతరులను బాధపెట్టడమే కాకుండా దేవుని నైతికనియమాలను కూడా నొప్పించేవిధంగా ఉంటుంది. దేవుడు మంచిదిగా సృష్టించిన ఈ సృష్టిలో పాపం అనేది ఆయన మంచితనానికి మరియు ఆయన పరిశుద్ధతకు వ్యతిరేకంగా ఉంటుంది. దేవుడు మంచిని (పరిశుద్ధతను) ప్రేమించి పాపాన్ని లేక చెడును ద్వేషించేవాడిగా ఉన్నాడు. ఎందుకంటే చెడు (పాపం) అనేది ఆయన నైతిక స్వభావానికి విరుద్ధమైనది. కాబట్టి దానిని ఆయన ద్వేషిస్తూనే ఉంటాడు.
ముగింపు:
పాపం అంటే ఏంటో అర్థం చేసుకోవడం; దేవుని విమోచనా సంబంధమైన ప్రణాళిక అనగా యేసుక్రీస్తు ద్వారా మనకు ఆయన నిర్ణయించిన రక్షణ మనకు ఎంతగా అవసరమో తెలియచేస్తుంది. ఇది కేవలం పాపపు క్రియలకు మనల్ని దూరంగా ఉంచడమే కాదు దేవుని చిత్తానికి అనుగుణంగా మన హృదయాలను మార్చుకోవడం. పాపం మనలను దేవుని నుండి వేరు చేస్తుంది, కానీ క్రీస్తు ద్వారా మనం ఆయనతో సరైన సంబంధాన్ని కలిగియుంటాం.