బైబిల్ కోణంలో దైవశాస్త్రం (థియాలజీ) అంటే ఏంటి?
దైవశాస్త్రం (థియాలజీ) అనేది చాలా పెద్ద పదం, కానీ సులభంగా దానిని దేవుని గురించి అధ్యయనం చేసే శాస్త్రంగా చెప్పవచ్చు. ఈ దైవశాస్త్రం (థియాలజీ) అనేది దేవుడంటే ఎవరు ఆయన మనకోసం ఏం చేసాడు, ఆయన మన నుండి ఏం కోరుకుంటున్నాడు అనే దానిని తెలియచేస్తుంది. క్రైస్తవులు ఈ విషయాలను బైబిల్ ద్వారా తెలుసుకుంటారు. దేవుడు వారికి ఇచ్చిన దైవసందేశంగా దీనిని వారు భావిస్తారు. దైవశాస్త్రం (థియాలజీ) అనేది కేవలం విద్యాసంబంధమైన క్రమశిక్షణ మాత్రమే కాదు, లేఖనాల ద్వారా దేవుడు అనుగ్రహించే ప్రత్యక్షత కూడా. ఈ కోణం మనకు దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని, లేఖనాల యొక్క అధికారాన్నీ అలానే మన రక్షణకు ఆయన కృప ఎంతగా అవసరం అనేదానినీ తెలియచేస్తుంది.
దైవశాస్త్రం (థియాలజీ) అంటే ఏంటి? – Definition
థియాలజీ అనేది “థియోస్” (గాడ్) “లోగోస్” (పదం లేదా అధ్యయనం) అనే రెండు గ్రీకు పదాల కలయిక. ఇదే మన తెలుగులో దైవశాస్త్రంగా పిలవబడుతుంది. ఇది దేవుని గురించి అధ్యయనం చెయ్యడానికి మరియు ఆయన గురించిన విషయాలు నేర్చుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. నిజానికి నిజమైన జ్ఞానం అనేది దేవుడు మనకు అనుగ్రహించే తన ప్రత్యక్షతల ద్వారానే అనుగ్రహించబడుతుంది. అది ప్రేరేపితమైనది, తప్పుపట్టలేనిది, మరియు అధికారికమైనది.
దైవశాస్త్రం (థియాలజీ) దేవుని నియంత్రణలో ఉంది ( God is in control)
దేవుని నియంత్రణలోనే అన్నీ ఉన్నాయనేది ప్రధానమైన విశ్వాసం. దీని అర్థం ఏంటంటే దేవుని జ్ఞానం, ఆయన అధికారం లేనిదే ఈ సృష్టిలో ఏదీ జరగదు. దేవుడు ఈ ప్రపంచం గురించీ అలానే ప్రతీ మనిషి గురించీ ఒక ప్రణాళికను కలిగియున్నాడు (యెషయా 46:9,10).
బైబిల్ మార్గదర్శకం (Bible as Guide)
క్రైస్తవులు దేవుని గురించి తెలుసుకోవడానికి అత్యున్నతమైన మార్గంగా బైబిల్ ని ఎంచుతారు. బైబిల్ అనేది ఒక మార్గనిర్దేశిని, ఇది దేవుడు అనేవాడు ఎవరు ఆయన మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు అనే విషయాలను మనకు తెలియచేస్తుంది. బైబిల్ క్రింది వాటి గురించి స్పష్టంగా చెబుతుంది.
సృష్టి: దేవుడు ప్రపంచాన్నీ అందులో ఉన్న సమస్తాన్నీ ఎలా సృష్టించాడు (ఆదికాండము 1,2 అధ్యాయాలు).
మానవ పతనం: మానవులు పాపం చేసి దేవునితో ఉన్న సంబంధాన్ని ఎలా కోల్పోయారు (ఆదికాండము 3వ అధ్యాయం)
విమోచన: దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును పంపి మానవులను వారి పాపాల నుండి ఎలా రక్షించాడు (ఎఫెసీ 1:7).
పునరుద్ధరణ: భవిష్యత్తులో ప్రతీదీ క్రొత్తగా మరియు ఖచిత్తమైనదిగా చేస్తానని ఆయన వాగ్దానం చేసాడు (ప్రకటన 21:22).
యేసుక్రీస్తే కేంద్రితంగా ఉన్నాడు: ( Jesus is central)
దైవశాస్త్రానికి యేసుక్రీస్తు హృదయం లాంటివాడు. క్రైస్తవులు యేసుక్రీస్తు దైవకుమారుడని (తండ్రితో సమానుడైన దేవుడని) మరియు ఆయన ఈ లోకానికి వచ్చి ప్రజలను వారిపాపాల నుండి రక్షించాడని నమ్ముతారు. ఆ యేసుక్రీస్తును నమ్మడం ద్వారా ప్రజలు దేవునితో సంబంధాన్ని కలిగియుండడమే కాకుండా నిత్యత్వాన్ని కూడా పొందుకుంటారు.
ప్రధానమైన నమ్మకాలు: ఇవి కొన్ని ప్రధానమైన నమ్మకాలు అలానే అత్యంత ప్రాముఖ్యమైనవి కూడా.
లేఖనాలు మాత్రమే (Scripture alone): విశ్వాసానికి మరియు క్రియలకూ బైబిల్ అనేది అంతిమ ప్రామాణికం.
విశ్వాసం మాత్రమే (Faith alone): ప్రజలు దేవుని యొద్దకు కొన్ని మంచిపనులు చెయ్యడం ద్వారా కాదు కానీ విశ్వాసం ద్వారా మాత్రమే రావడం జరుగుతుంది.
కృప మాత్రమే (Grace alone): రక్షణ అనేది కేవలం దేవుని యొక్క కృపయే కానీ మనం సంపాదించుకున్నది కాదు.
క్రీస్తు మాత్రమే (Christ Alone): మానవునికీ దేవునికీ మధ్యలో మధ్యవర్తి యేసుక్రీస్తు మాత్రమే.
దేవుని మహిమకు మాత్రమే (Glory to God alone): ఆయన చేసిన ప్రతీదానికీ సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయనకే చెల్లును.
దేవుని వాగ్దానాలు: God’s Promises
బైబిల్ దేవుని వాగ్దానాల గురించి ప్రజలకు వివరించడాన్నే నిబంధన అంటారు. ఈ వాగ్దానాలు అనేవి ఆదాముతో మొదలై చరిత్రలో కొనసాగుతూ యేసుక్రీస్తులో ముగిసాయి. ఎందుకంటే యేసుక్రీస్తు ద్వారా ప్రజలు ఒక క్రొత్త నిబంధనలో భాగంగా చెయ్యబడ్డారు (హెబ్రీ 8:6-13).
దైవశాస్త్ర ప్రకారం జీవించడం (Living Out Theology)
దైవశాస్త్రం (థియాలజీ) అనేది కొన్ని విషయాల గురించి తెలుసుకోవడానికి మాత్రమే కాదు ఇది మనం ఎలా జీవించాలి, దేవునికి ఎలా ప్రార్థించాలి, దేవుణ్ణి ఎలా ప్రేమించాలి, ఇతరులను ఎలా ప్రేమించాలి అనేది తెలియచేస్తుంది. అదేవిధంగా ప్రతీరోజూ దేవుని సహాయం మనకు ఎంతగా అవసరమో, ఆయనపై మనం ఎంతగా ఆధారపడాలో కూడా తెలియచేస్తుంది.
ముగింపు ( Conclusion)
దైవశాస్త్రం (థియాలజీ) మనకు దేవుడు ఎవరు? ఆయన మననుండి ఏం కోరుకుంటున్నాడు అనేదానిని తెలియచేస్తుంది. అలానే యేసుక్రీస్తే కేంద్రితంగా ఉన్నాడని, బైబిల్ యే నిర్దేశితంగా ఉందని, దేవునికీ మనకూ మధ్యలో సంబంధాన్ని బలపరచడానికి యేసుక్రీస్తే కేంద్రంగా ఉన్నాడని బోధిస్తుంది. మనం ఈ సత్యాలను తెలుసుకుని ఆ ప్రకారంగా జీవించడం ద్వారా దేవుణ్ణి ఘనపరచినవారము, ఇతరులకు ఆయన ప్రేమను చూపించిన వారమవుతాము.