పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడడమంటే ఏంటి?
మనుష్యకుమారునికి విరోధముగా మాటలాడువానికి పాపక్షమాపణ కలదుగాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు. మత్తయి 12:32
యేసు క్రీస్తు ఈ భూమిమీద తనపరిచర్య ప్రారంభించినప్పటి నుండీ, ఎన్నో ఆశ్చర్యకార్యాలను చేసాడు. ఎక్కడికెళ్ళినా, తన చుట్టూ ప్రజలు(శిష్యులు , పరిసయ్యులు) వెంబడిస్తుండేవారు. యేసుక్రీస్తు, తాను దేవునివద్దనుండి వచ్చిన మెస్సీయ్య(మనుష్యకుమారుడు)నని, యూదులకు నిరూపించడానికి ఎన్నో అద్భుతాలను వారి కన్నుల ముందే చేసాడు. వాటిలో,దెయ్యాలను వెళ్ళగొట్టడం ఒకటి.
అలాంటి ఒక సంఘటనను మత్తయి 12:22 లో మనం చూస్తాం. దయ్యం పట్టిన గ్రుడ్డి, మూగవాడైన ఒకడు యేసుక్రీస్తు దగ్గరికి తీసుకుని రాబడ్డప్పుడు, అయన వాడిని స్వస్థపరుస్తాడు. అక్కడున్న ప్రజలందరూ ఆశ్చర్యంతో ఇతను దావీదు కుమారుడు కాడా?, అని మాట్లాడుకుంటూ ఉంటే , ఎప్పుడెప్పుడు క్రీస్తు మీద నింద వేసి, అయన దేవుని కుమారుడు కాదని నిరూపిద్దామా అని ఆలోచించే పరిసయ్యులు అక్కడ వేచి ఉన్నారు. వారు ఎప్పుడైతే యేసుక్రీస్తును ప్రజలు దావీదుకుమారుడని సంబోధించిన మాటను విన్నారో, వీడు దయ్యాలకు అధిపతైన బయెల్జెబూలు వల్లే దయ్యాలను వెళ్ళగొడతన్నాడు కాని మరొకరిద్వారా కాదని అన్నారు.
అప్పుడు యేసు క్రీస్తు , వారికి తార్కికంగా సమాధానం ఇచ్చి, వారికున్న తప్పుడు బోధలను సరిచేస్తాడు (మత్తయి 12:25-30), అదే సందర్భంలో యేసు పరిశుద్ధాత్మకు విరోధంగా మాటలాడువానికి ఈ యుగమందైనా రాబోవు యుగమందైనా పాపక్షమాపణ లేదని చెబుతాడు. ఆయన ఈ మాట ఎవర్ని ఉద్దేశించి అన్నాడు? ఎందుకు అన్నాడు?
మొదటిగా, ఆయన ఈ మాటలను పరిసయ్యులును ఉద్దేశించి మాట్లాడాడు. బాప్తిస్మమిచ్చు యోహాను, మెస్సీయ్య గురించి, రాబోవు రాజ్యం గురించి చెప్పినప్పుడు పరిసయ్యులు వారికి ధర్మశాస్త్రం తెలిసినప్పటికీ ఒప్పుకోలేదు (మత్తయి 3:1-12). యేసుక్రీస్తు వారి కళ్ళముందు చేసిన ఎన్నో ఆర్చర్యకార్యాలు చూసినాకానీ తమ హృదయాలను కఠినపరచుకున్నారు, క్రీస్తు దైవత్వాన్ని శంకించారు. ఎన్నోసార్లు ఆయన్ని శోధించడంతో పాటుగా, ఆయనకు విరోధంగా కూడా మాట్లాడుతూవచ్చారు. కానీ ఈసారి వారు గీత దాటారు.
అప్పుడు క్రీస్తు, మీరు నాకు (మనుష్యకుమారునికి ) విరోధంగా మాట్లాడినా పాపక్షమాపణ ఉంది కానీ, పరిశుద్ధాత్మకు విరోధంగా మాటలాడేవాడికి క్షమాపణ లేదు అని సూటిగా చెబుతాడు. ఇంతకూ ఆ సందర్భంలో పరిసయ్యులు పరిశుద్ధాత్మకు విరోధంగా ఏం మాట్లాడారు?
మొదటిగా, యేసుక్రీస్తు పలికిన ఆ మాటలను బట్టి పరిశుద్దాత్మ కంటే మనుష్యకుమారుడు తక్కువ ప్రాముఖ్యత కలిగి ఉన్నాడని అర్థం కాదని మనం గుర్తుంచుకోవాలి. తండ్రి, కుమారుడు, మరియు పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ సమానులు మరియు శాశ్వతమైనవారు. అయితే ఇక్కడ వీడు దెయ్యాలకు అధిపతైన బయెల్జెబూలువల్లే దయ్యాలను వెళ్లగొడతన్నాడని పరిసయ్యులు పరిశుద్ధాత్మ కార్యాన్ని సాతాను క్రియలకు ఆపాదించారు. వారి నోటితో దైవదూషణ చేసారు.
వీరు చేసిన ఈ పాపం (దూషణ) తెలియక చేసింది కాదు. ధర్మశాస్త్రాన్ని ఎరిగి, క్రీస్తుతో సన్నిహితంగా తిరిగిన వారైన వీరు, కేవలం దేవుడు మాత్రమే చేయగల ఆశ్చర్యకార్యాలకు ప్రత్యక్షసాక్షులుగా ఉండి కూడా దేవుణ్ణి వారి నోటి మాటలతో బహిరంగంగా దైవదూషణ చేసారు.
క్రీస్తు స్వయంగా లూకా సువార్త 11: 20 లో తాను దేవుని వ్రేలితో (పరిశుద్ధాత్మ) దెయ్యాలను తరిమివేసినట్లు చెప్పాడు. ఆ పరిశుద్ధాత్మ చేసే కార్యాన్ని దూషిస్తే (వేరొకరికి ఆపాదిస్తే) అది దేవుని దృష్టిలో ఈ యుగమందైనా రాబోవు యుగమందైనా క్షమాపణ లేని పాపం.